Book Description
ఆమె చేతిలో సీసా చూచి గావుకేక పెట్టాడు నీలకాంత్. ‘‘ఏంపని చేశావు అంజనా?’’ ఒక్క అంగలో వెళ్ళి ఆమెను చేతుల్లోకి తీసుకొన్నాడు. విషాదహాసం చేసింది. ‘‘ఇంతకంటే గత్యంతరం లేకపోయింది’’ మెల్లగా అతడి చేతుల నుండి పాదాలమీదికి జారింది. భర్త ముఖంలోకి వాలిపోతున్న కళ్ళను విచ్చి చూస్తూ, క్రమ క్రమంగా క్షీణించిపోతున్న గొంతుతో అన్నది. ‘‘భర్త కంటే మిన్న అయినదీ, వాంఛించతగినదీ ఈ ప్రపంచంలో మరేదీ లేదని తెలుసుకొన్న స్త్రీ దౌర్భాగ్యవశం చేత పరిత్యక్త అయితే, ఆమె జీవితం యెంత దుర్భరమో స్త్రీకి నిర్వచనం తెలిసినవారికే అవగాహన. ‘‘సౌరభ రహితమూ, సౌందర్య విహీనమూఅయిన పువ్వును కూడా దేవుని శిరసున పెట్టగలిగితే ఆ పువ్వు పవిత్రతకు మరే పువ్వూ సరితూగలేదు. దాని విలువ యెంతో అపారం. గతంలో నేనెంత పాపమైనా చేసి వుండవచ్చు. దుష్టమతినే కావచ్చు. భాగ్యవశంచేత నాకు జ్ఞానోదయమైంది. నిండు భక్తి ప్రపత్తులతో నా పతి చరణాలకు నా హృదయం అర్పించుకొన్నాను. ఒకనాటి నా కళంక చరిత్ర ఈ నివేదనతో పరిశుద్ధము, నిష్కళంకముఅయినదనే అనుకొంటున్నాను. ఇక ఏ పాపమూనా వెంట రాదన్న సంతృప్తితో కన్ను మూస్తున్నాను.’’ - పూజా సుమం