Book Description
నోట మాట రానంతగా ఆశ్చర్యపోయింది అపర్ణ. ‘‘నేను ఆయనకి లవ్ లెటర్ రాశానా? అది నువ్వు చూశావా? ఎప్పుడు చూశావ్? ఎలా చూశావ్?’’ ఆశ్చర్యం నుంచి తేరుకొని అడిగింది. ‘‘అలా అడుగు చెప్తాను. ఆవేళ మా నాన్నావాళ్ళు చిన్న తిరుపతి వెళ్ళినప్పుడు మీ ఇంటికి వచ్చి నీ రూమ్‍లో పడుకోలేదూ నేను? ఆవేళ చూశాను. నవల చదువుకుంటూ ఉంటే అందులో కనిపించింది నీ ఉత్తరం. నేను చదివాను. ‘ప్రియమైన చెందూ’ అంటూ మొదలెట్టి భలేగా రాశావు. నువ్వు చెప్పకపోయినా నేను గ్రహించేశాను. ‘చెందూ’ అంటే ఎవరా అని ఆలోచించేసరికి తెలిసిపోయింది. వెంటనే చంద్రశేఖరంగారికి చెప్పేశాను’’ అంటూ తను చేసిన ఘనకార్యం బయటపెట్టేశాడు. అంతా శ్రద్ధగా విన్న అపర్ణకి ముందు ఏమీ అర్థంకాలేదు. అర్ధమైన మరుక్షణం తలబాదుకుంది. ‘‘గొప్పపని చేశావు! మంచి ఇంటలిజెంట్‍వి కదూ! ఇలాగే చెయ్యాలి మరి! కర్మ! అందులోని చెందూ ఈయన కాదు. అసలా ఉత్తరం ఈయనకోసం రాయలేదు నేను. లక్ష్మి రాసిపెట్టమంటే రాసి ఇచ్చాను’’ అంది. అపర్ణ, మోహన్‍లకు పెళ్ళి నిశ్చయమయింది. కానీ అపర్ణ శేఖర్‍లకి; లక్ష్మీ మోహన్‍లకి పెళ్ళి జరుగుతోంది. అలా జరగటానికి గల వింత కారణాలు, వారిలో వారికి వచ్చిన అపోహలు, వారి మధ్య ఉన్న స్నేహాలు అన్నీ కలగలిసిన ఈ నవల ఎంతో హుషారుగా సాగుతుంది.