Book Description
మామిడికాయ పప్పు, చల్లమిరపకాయలు, గుమ్మడి వడియాలు, గుత్తివంకాయ కూర, ధనియాలు కొబ్బరి కలిపి దేశవాళి ఆనపకాయ ముక్కలు వేసిన చల్లపులుసు, ఎర్రగాకాచి తోడెట్టిన గెడ్డ పెరుగు, వెన్నకాచిన ఘుమ ఘుమలాడే నెయ్యి, మామిడిపళ్ళతో నోరూరించే ఘనమైన భోజనం వచ్చింది. అంత మధురమైన భోజనం తిని ఎన్నిరోజులైందో? ఆ భోజనం నాతోపాటు మిగిలినవాళ్ళుకూడా సుష్టుగా తినడం వలన ఆ రోజు నేను పని కూడా ఎక్కువగా చెయ్యలేక ఇంటికి వచ్చి నిద్రపోయాను. మధ్యాహ్నం లేచేసరికి రాజారావు నేతి పూతరేకులు, శనగ వడలు తెచ్చిపెట్టాడు. పూతరేకులు ఎక్కడివి అని అడిగితే రామరాజు దొరగారు ఆత్రేయపురం నుంచి తెప్పించారండి అన్నాడు. నోట్లో వేసుకోగానే అవి కరిగిపోయాయి. రెండవరోజు ఉదయం వెన్నపూస, కారప్పొడి, అల్లం పచ్చిమిర్చి చట్నీ, శనగచట్ని, కొబ్బరి చట్నీ బాలచందమామల్లాంటి అరడజను ఇడ్లీలతోపాటు, అల్లం జీలకర్ర, పచ్చిమిర్చి గార్నిష్ చేసిన చిన్న చిన్న నేతి పెసరట్లు కూడా పెద్ద పింగాణీ ప్లేటులోపెట్జి తెచ్చాడు రాజారావు. ‘‘ఏంటండి బాబు ఈ ఏర్పాట్లు? నాకు చాలా సిగ్గుగా ఉంది.’’ అనగానే ‘‘భలేఓరే! మా ఊర్లోకి వచ్చిన పొరుగూరువాళ్ళకి ఆ మాత్రం భోజనం పెట్జడం కూడా గొప్పెనంటారా! మనకున్నది అంతా మనం కూడాపట్టుకెళ్ళలేంకదా సర్’’ అంటూ దగ్గరుండి అన్ని కొసరి కొసరి తినిపించాడు. ఈలాంటి మర్యాదలు కావాలంటే కోనసీమ వెళ్ళాల్సిందే!