Book Description
‘నవల’ అంటే దేశ కాల పాత్ర భేదాలతో కొందరి జీవిత చరిత్రలను మేళవింపజేసి మనోహరంగా చెప్పే చక్కని కథ. నవల ఇటలీలో పుట్టి, ఫ్రాన్సులో పరిపక్వం పొంది, రష్యాలో గొప్ప ప్రయోజనాలు సాధించి, ఇంగ్లాండులోను, అమెరికాలోను ఇంటింటి దీపమై వికాసం పొందింది. రమాదేవిగారి నవల ‘అందరూ మనుషులే’లో అన్నిరకాల ప్రవృత్తికలవారూ ఉన్నారు. ఈ చిత్తవృత్తుల చిత్రించడంలో కాని ఈ స్త్రీ జనలోకంలో ఇంతమంది శ్రీమతులలో ‘శశి’ని చిత్రించడంలో కాని ఆమె వెనుకంజ వేయలేదు. ఒక స్త్రీ దృక్పథంలో తాను కన్నది కన్నట్లు, విన్నది విన్నట్లు, ఉన్నది ఉన్నట్లు రాశారు. ఆ కలానికి అడ్డులేదు. ఆ మాటలకు ఎదురుమాటలు లేవు. ఇన్ని పుటలు రాయడమంటే ఎన్నో సుందరచిత్రాలతో కూడిన రంగు రంగుల తివాచీ నేసినట్లే. ఈ నవలలో పాత్రలు నిజంగా జీవితంలో కనిపించే పాత్రలలాగ కనిపించవచ్చును. సాహిత్యం జీవితానికి ప్రతిబింబం. రమాదేవి కొన్ని సజీవ పాత్రలకు తన సాహిత్యదర్పణం పట్టింది. అంతమాత్రం చేత పురాణకథలోని గుమ్మడికాయల దొంగలాగున ఎవరూ భుజాలు తడుముకోనక్కరలేదు.