Andhrapatham
Andhrapatham by Sai Papineni
గతమెంతొ ఘనకీర్తి కలవోడా… చరిత్రకి మూలం రాతయైతే, తెలుగువారి చరిత్ర ఈనాటిది కాదు. అశోకుని శాసనాలకు ముందే భట్టిప్రోలులో లభించిన ప్రాకృత లిపిలో తెలుగు ‘తలకట్టు’ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆగ్నేయాసియా దేశాల్లో నాగరికత విస్తరణకి కృష్ణా గోదావరీ తీరాలే మూలస్థానం. శాతవాహన, ఇక్ష్వాకు, వేంగి, పల్లవ, కాకతీయ, చోడ, విజయనగర రాజ్యాలు దేశ రాజకీయాలనే గాక, ప్రపంచ వాణిజ్యాన్ని నిర్దేశించాయి. ప్రాచీన భారతీయ సంస్కృతి అంతరించకుండా కాపు కాసింది తెలుగువారే. కాలగమనంలోని పరిణామాలకు అనుగుణంగా సర్దుబాట్లు చేసుకుంటూ పొరుగు సంస్కృతుల పట్ల సమన్వయంతో వ్యవహరించడం మనకి కొత్తేమీకాదు. ప్రాంతీయ తత్వం, భాషా దురభిమానం వెర్రితలలు వేస్తున్న నేపధ్యంలో, తెలుగు ప్రజల సామరస్య ధోరణి మన చారిత్రక ఘనత మరుగుపడేందుకు కారణమయింది. చారిత్రక సాహిత్యం కరువయింది. చరిత్రలో ఏమున్నది గర్వకారణం, అనే నిర్లిప్త భావన నేటి తెలుగువారిలోలా మరెవరిలోనూ కనిపించదు. ఈ అవగాహన లోపాన్ని సరిదిద్దాలంటే, మనలో చరిత్ర పట్ల నిద్రాణమై ఉన్న ఆసక్తిని తట్టిలేపాలి. ఆ దిశలో చేస్తున్న మరో ప్రయత్నమే... ఆంధ్రపథం A Journey into History చరిత్రలోకి ప్రయాణంలో మైలురాళ్లలా మన సంస్కృతికి అద్దంపట్టే 27 కథలూ, వాటి నేపధ్యాన్ని వివరించే కథనాలు. పదం నుంచి పథంలోకి’ శీర్షికతో సాక్షి దినపత్రికలో ధారావాహికంగా ప్రచురించబడ్డాయి.