Book Description
నా కిటికీల లోంచి ఆకాశం.. నా సర్టిఫికెట్లు చూసిన హెచ్.ఆర్. చాలా ఆశ్చర్యపోతూ ‘‘ఈ ఉద్యోగానికి ఎందుకొచ్చినట్లూ? యూఆర్ ఎ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్’’ అన్నాడు. ‘‘నాకు పదకొండువేల తొంభై ఆరు రూపాయలు అవసరం’’ తడుముకోకుండా చెప్పాను. వాళ్ళు ఆశ్చర్యంతో ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ఒక పెద్దాయన కాగితం, పెన్ను నా ముందుకి తోసి ‘‘వెల్! ఆ జీతం అంత ఖచ్చితంగా చెప్పావు కాబట్టి నీ ప్రయారిటీస్ కూడా ఖచ్చితంగా రాసి చూపించు’’ అన్నాడు. నాకు నవ్వొచ్చింది. మొదటిసారి నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, ఇలాగే రాయమన్నప్పుడు విరజకోసం ఓ ఫ్లాటూ, ఆమెని తిప్పడానికి ఓ చిన్నకారూ, మా హనీమూన్‌కి డార్జిలింగ్ వెళ్ళడానికి ఎయిర్ టికెట్సూలాంటివి ఆలోచిస్తూ రాశాను. నాకీసారి ఆ బెంగలేదు. వరుసగా రాశాను. ఇంటద్దె, వాచ్మెన్ తాతకి దగ్గుమందు, అంజమ్మ కొడుకు ఫీజు, నా సరుకులు, నామాలకి హెలీకాఫ్టర్ బొమ్మ, రామారావుగారికి కరెంట్‌తో నడిచే కుట్టుమిషన్, ఆయన మనుమరాలి పేరుమీద ప్రతినెలా కొంత డబ్బు, రెండొందల యాభై రూపాయలు.. నా పావురాలకోసం! ఈ ఉద్యోగం నాకే వచ్చింది. ఇది ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే, ఈ కంపెనీలన్నీ రామానుజంగారివి... మానాన్నకి దగ్గర మిత్రుడాయన! వారి అమ్మాయి మాధవిని చేసుకుని, దీనికి ఓనర్ని అయినా ఇంత ఆనందం, తృప్తీ దొరికేవి కావేమో!