Book Description
తొలిరాత్రి... వధువు పాలగ్లాసుతో నిలబడివుంది. ‘‘నువ్వు పెళ్ళికి ముందు ఎవరినైనా ప్రేమించావా?’’ అని అడిగాడు వరుడు. ఆమె బిత్తరబోయి చూసింది. ‘‘పర్లేదు చెప్పు. కట్టుకున్నవాడి దగ్గర దాపరికాలు వుండకూడదు. సర్వస్వం సమర్పించినట్లే అన్నీ విప్పి చెప్పాలి. ఊ! చెప్పాలి మరి!’’ అని బలవంతం చేశాడు. ఆమె అమాయకంగా చెప్పింది. అతను చెంప అదిరేటట్లుకొట్టి ‘‘ఛీ కులటా! పాతకీ! ఎంత అమాయకంగా ఇదే మొదటిసారి అన్నట్లు పాలగ్లాసు తీసుకొని గదిలోకి వచ్చావే! ఫో.. వాడి దగ్గరకే ఫో..’’ అని హుంకరించాడు. ఆమె ఏడుస్తూ గదిలోంచి వచ్చి రెండవ అమ్మాయితో ‘‘నువ్వు మాత్రం రేపు నీ పెళ్ళయ్యాక నీ భర్త ఎంత బలవంతం పెట్టినా నీ పాత ప్రేమల గురించి చెప్పకూడదు’’ అని తన తల మీద చేయి పెట్టించుకుని ప్రమాణం చేయించుకుంది. తొలిరాత్రి... రెండవ అమ్మాయి పాలగ్లాసుతో వెళ్ళింది. ఆమె భర్త అదే ప్రశ్న వేశాడు. ఆమె ‘‘అబ్బే.. అటువంటివేం లేవు’’ అంది. అతను ఎంత అడిగినా అదే జవాబు చెప్పింది. అయినా నాలుగురోజుల తర్వాత అతనూ ఈడ్చి చెంప మీద కొట్టి బయటకి తరిమేవాడు. ఎందువల్ల? ఈ రెండు సంఘటనలకీ ప్రత్యక్ష సాక్షి అయిన మూడవ అమ్మాయి ఏం నిర్ణయించుకుంది? ఎటువంటి భర్తను ఎంచుకుంది? ఈ ప్రశ్నలకి సమాధానాలు ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి తెలుసుకోవాల్సిందే. తెలుసుకోవాలంటే ‘‘ఔనస్త్రంటే కాదంటా’’ చదవాలి మరి!