Book Description
అర్థరాత్రి దాటుతున్నా లావాలా కుతకుతలాడుతూ నిద్రపట్టనీయని తన పూనర్వివాహపు ఆలోచనలతో సతమతమవుతున్న సీతారామయ్య లేచి చల్లగాలిలో దొడ్లోకి నడిచి పైన మిణుకుమిణుకుమంటున్న నక్షత్రాలవంక చూస్తూ నిలబడ్డాడు. ‘‘ఆ నక్షత్రాలెంత ఆకర్షణీయంగా ఉన్నా ఎంత ఎగిరినా చేతికి అందవు. అలాగే తనూ తన పిల్లలకి సేవచేసే తల్లీ, తన అవసరాలు తీర్చే కొత్త భార్య అనే అందని ద్రాక్ష కోసం అర్రులు చాస్తున్నాడా? తన శ్రేయోభిలాషిగా సుశీల సంబంధం గురించి సోమయాజులు చెప్పడంలో అతని తప్పేమీ లేదు. కానీ కూతురు పెళ్ళి చేయలేని అవధానిగారి దరిద్రాన్ని అవకాశంగా తీసుకుని ఇరవయ్యేళ్ళ కన్నె సుశీలని స్వంతం చేసుకుని తన అవసరాలు తీర్చుకోవాలనుకోవడం ధర్మమేనా, సమంజసమేనా? అది అవకాశవాదం కాదా? సుశీల తన పెద్దకూతురుకన్నా కేవలం ఎనిమిదేళ్ళే పెద్ద. అటువంటి సుశీల తన పిల్లల్ని కన్నతల్లిలా చూడాలనుకోవడం అత్యాశకాదా? అది సాధ్యమా? సుశీలా తనూ ఈడూ జోడూ ఎలా అవుతారు? ఆమెకు తను తగిన భర్త కాగలడా?