Book Description
మాధవీదేవి చప్పున తల కుడివైపుకు తిప్పి పట్టమహిషి వేదిక వైపు దృష్టి సారించింది. ఆమెతో పాటే సరస్వతి చూపులు కూడా అటు తిరిగినవి. పట్టమహిషి తీక్షణ వీక్షనాలను ఉభయులూ గమనించారు. సరస్వతి తన రాణి భావం గ్రహించే నిమిత్తం మాధవీదేవి ముఖంలోకి చూసి ఆశ్చర్యపడింది. తాను ఇరవై ఏళ్ళుగా ఎరిగిన మాధవీదేవి కాదీమె. ఈనాటి ఆమె ప్రవర్తన సరస్వతికి ఎంత ఆలోచించినా అంతుబట్టటం లేదు. రాణి తాను బైటపడకుండా గొప్ప నటనను ప్రదర్శిస్తోందనే సంగతి సరస్వతికి తెలుసు. నిన్న సాయంత్రం వరకూ మామూలుగా ఉన్న రాణిలో ఇంత గొప్ప మార్పు ఒక్క రాత్రిలో ఎలా వచ్చి పడిందో సరస్వతి ఊహకు అందటంలేదు. ఏదో గొప్ప విషమ సమస్య మనసును పీడించి, పిండివేసేదే ఆమెను బాధపెడుతూండి ఉండాలి. తన ఆందోళన బహిర్గతం కాకుండా రాణి ఎంత చాకచక్యంతో సమర్థించగలదో చూడాలి.