Book Description
మార్క్ట్వేన్ (1835-1910) అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో జన్మించాడు. నావికుడుగా, పత్రికా రచయితగా జీవితం ప్రారంభించాడు. అసలు పేరు శామ్యూల్ లాంగ్ హార్న్ క్లిమెన్స్. ‘‘మార్క్ట్వేన్’’ అనే మారుపేరుతో హాస్యరచయితగా సుప్రసిద్ధుడయ్యాడు. రెండు మూడుసార్లు ప్రపంచంమంతటా ఉపన్యాసాలిస్తూ పర్యటించాడు. 1900 ప్రాంతంలో మన దేశానికి కూడా వచ్చాడు. ఏ కాలేజీల్లోను, స్కూళ్ళల్లోను చదువుకోకపోయినా ఇతడు 1907లో ఇంగ్లండు వెళ్ళినప్పుడు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంవారు ‘‘డాక్టర్ ఆఫ్ లిటరేచర్’’ పురస్కారంతో గౌరవించారు. గాఢమైన ప్రజాస్వామికవాది. మొదట్లో హాస్యం కోసమే హాస్య రచన చేశాడు. పరిణతి పొందినకొద్దీ ఈయన హాస్యంలో నిశితమైన వ్యంగ్యం అంతర్వాహినిగా నడిచింది. నిజమైన హాస్యం కరుణరసానికి దారితీస్తుందని మార్క్ట్వేన్ ఒకసారి అన్నాడు. ఉత్తమ శ్రేణికి చెందివుండి విస్తృత పాఠకాదరణ పొందిన కొద్దిమంది రచయితల్లో ఈయన ఒకడు. ‘‘హకల్‍బెరీఫిన్’’ నవలలో అమెరికన్ నీగ్రోల బానిసతనపు సమస్య చిత్రీకరించబడింది. పీడిత జాతులమీద మార్క్ట్వేన్‍కు గల సానుభూతి ఇందులో వ్యక్తమవుతుంది. టామ్‍సాయర్ శిష్యుడైన హకల్‍బెరీఫిన్ ఈ కథలో ముఖ్యపాత్ర.