Book Description
బయట ఈదురుగలి, వర్షం. నవంబరు నెల ఇంకా అప్పుడే ప్రవేశించినా 3 రోజులుగా మొదలైన తుఫాను గాలుల మూలంగా బాగా చలిగా వుంది. కేంటీన్‍లో వున్న టేబుల్ ముందు కూర్చుని వున్నారు ఒక జంట. ఆ అమ్మాయి నవ వధువులా వుంది. పుట్టింటి నుండి అత్తారింటికో, అత్తారింటి నుండి పుట్టింటికో ప్రయాణం చేస్తున్నట్టు వుంది. లేత నీలం రంగు కాశ్మీర్ సిల్క్ చీర కట్టుకుంది. జడలో పువ్వుల దండ తురుముకుంది. టేబుల్ కింద నుండి ఆమె కాలుకి తన కాలు తాకిస్తూ గిలిగింతలు పెడుతున్నాడు ఆ యువకుడు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని ఆప్యాయంగా ఒత్తుతున్నాడు. బెదిరే కళ్ళతో ఆ పిల్ల అటూ ఇటూ చూస్తోంది. భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధం, సాన్నిహిత్యంలో వుండే సరసం అందరికీ తెలిసిందే. కానీ అది చూపుకోడానికి ముఖ్యంగా మన దేశంలో, మన సంస్క•తిలో కొన్ని వేళలు, హద్దులు, స్థలాలు కేటాయించి వదిలిపెట్టారు మన పెద్దలు. ఆ భయంతోటే ఆ పిల్ల అతన్ని మృదువుగా వారిస్తోంది. ఆ సమయంలో వారిద్దరి మనసుల్లో తిరుగాడే కోరిక అద్దంలో బొమ్మంత స్పష్టంగా వారి కళ్ళలో దోగాడుతోంది. ద్వివేదుల విశాలాక్షిగారి మరో అద్భుత రస సృష్టి ‘పరిహారం’. తప్పక చదవండి.