Book Description
సగంకాలిన కొవ్వొత్తి నుంచి కొవ్వు కారి టేబిలుమీద పడ్తుంది. గాలికి జ్యోతి కదులుతున్నప్పుడల్లా ఆ వెలుగునీడలు గదిగోడలపై నాట్యం చేస్తున్నాయి. తన చుట్టూ ఉన్న వస్తువులకి ప్రకాశం ఇస్తూ, తానుకాలిపోతుంది కొవ్వొత్తి. కొవ్వొత్తి ఆత్మార్పణతో పరిసరాలు వెలుగు సముపార్జించుకొంటున్నాయి. కాని తన్ను తాను కరిగించుకొంటూ ఇతరులకు వెలుగు పంచిపెడ్తున్న కొవ్వొత్తి చుట్టూ మిగిలింది చీకటి మాత్రమే. చిన్ననాటి నుంచి తనకోసం కాక, ఇతరుల కోసమే బ్రతకడం నేర్చుకొన్న లలిత... స్త్రీ సహజమైన ఒకే ఒక చిన్న కోరిక తీర్చుకోలేని లలిత... ఎదురుగా కాలుతున్న కొవ్వొత్తికి, పక్కమంచం మీద నివ్చలంగా నిద్రపోతున్న లలితకి ఏదో పోలిక ఉన్నట్లు అనిపించింది ప్రకాశానికి. ప్రపంచంలో కొందరు మనుషులు తమకోసమే తాము బ్రతుకుతారు, తమ మనుగడకోసమే ఇతరుల్ని బ్రతకనిస్తారు. మరికొంత మంది ఇతరుల కోసమే తాము బ్రతుకుతారు. వారి బ్రతుకుల సాఫల్యంతోనే తమ జీవితాలు నింపుకొంటారు. గడియారం పదకొండు గంటలు కొట్టింది. కొవ్వొత్తి ఇంకా వెలుగుతూనే ఉంది. ప్రకాశించే శక్తి తనలో మిగిలి ఉన్నంతవరకు అది చాలా తన్ను తాను కరగించుకొంటూ వెలుగుతూనే ఉంటుంది.