Book Description
నిన్నటి నా ప్రియనేస్తం... నన్ను అంతగా అభిమానించిన నువ్వు వేల కోట్ల బాసలతో బాసటగా వున్నావనుకున్నానే... ఏమయ్యావు నువ్వు? అందరి వెనకా నీడల మాటున దాగుని నాకెందుకు దూరమయ్యావు... ఎంత ఎదురుచూశాను నీకోసం? పచ్చిక మీద కూచుని నిరీక్షించడం అలవాటైన నేను జైలుగోడలకి గోడుని వినిపిస్తూ, నువ్వు వస్తావన్న ఆకస్మిక వైభవం కోసం ఎన్ని నిద్రలేని రాత్రుల్ని గడిపానో నీకెలా చెప్పను? నా ముఖాన్ని ప్రపంచానికి చూపించలేక ముష్టిదాని మల్లే ఏ దివ్యక్షణంలో అయినా దోసిలిలోకి రాలిపడే నీ ప్రేమభిక్ష కోసం అహోరాత్రులు ఎంత తపించానో నీకెలా వివరించను? ఇపుడెందుకయ్యా. ఇంత జరిగాక నాకెందుకు కనిపించావు? నిన్నూ, నీ ఉనికిని కాదనుకున్న నేను దుమ్ముతో నిండిన రాజబాటపై చాలా ముందుకు సాగిపోయానే. నీకు మాత్రమే నైవేద్యం కావాలనుకున్న బ్రతుకుని అంగడిలో పెట్టి అమ్ముకుంటూ బ్రతకడం అలవాటు చేసుకున్నానే... అన్ని పూలూ అమ్ముడు పోయేక ఈ ఖాళీ పూలసజ్జలో ఏముందని ఇలా వచ్చావు.