Book Description
ఆ ముగ్గురు విద్యార్థులనూ హుగ్లీ బ్రాంచి స్కూలు హెడ్ మాస్టరుగారు తమ విద్యాలయం రత్నాలుగా భావించేవారు. ఆ ముగ్గురూ వేరు వేరుగా మూడు దారులగుండా ప్రతిరోజూ ఓ కోసు దూరం నడిచి వస్తుండేవాళ్ళు. ముగ్గురూ పరస్పరం ఎంతో ప్రేమతో వుండేవాళ్ళు. ఆ ముగ్గురు మిత్రులూ మార్గమధ్యంలో ఓ మర్రిచెట్టు క్రింద ప్రతిరోజూ సమావేశమవుతూ, ఆ తరువాత స్కూలుకు వెళ్ళేవాళ్ళు. ముగ్గురి ఇళ్ళూ హుగ్లీకి పడమటి దిక్కుగానే ఉండేవి. ఈ ముగ్గురు కుర్రవాళ్ళు, పట్టణంలో ఏదయినా ఇల్లు అద్దెకు తీసుకొని వుండకుండా, వానలకూ, వరదలకూ భయడపకుండా, చలికీ ఎండకూ బాధపడకుండా, ప్రతిరోజూ ఇంత దూరం కాలినడకనే వస్తూ పోతూ వుండడానికి కారణం ఒకటి వుంది. ఆ కాలంలో ఏ తల్లిదండ్రులూ తమ ముద్దు బిడ్డలు పడుతున్న ఈ కష్టాన్ని ఓ కష్టంగా లెక్కించేవాళ్ళు కాదు. కష్టపడనిదే ఆ తల్లి సరస్వతీదేవి కరుణించదని, ఆమె దీవెన ఉండదనీ వారి భావన. కారణమేదయినా ఆ ముగ్గురు మిత్రులూ ఇదే విధంగా వస్తూపోతూ హైస్కూలు పరీక్ష పాసయ్యారు. ప్రతిరోజూ ఆ మర్రిచెట్టు క్రింద కూర్చొని, ముగ్గురు మిత్రులూ ‘జీవితంలో మనం విడిపోగూడదు, ఎన్నడూ పెళ్ళి చేసుకోగూడదు. ముగ్గురం ప్లీడర్లమై ఒకే యింట్లో వుండాలి, డబ్బు సంపాదించి ఒకే బాక్సులో వేయాలి. ఆ డబ్బుతో దేశసేవ చేయాలి’ అని ప్రతిజ్ఞ చేస్తూ ఉండేవాళ్ళు. ఇవి వారి బాల్య జీవితపు ఊహా జగత్తులోని విషయాలు. ఊహలు కాకుండా, యధార్థమయిన దాని రూపం, చివరకు ఏమయిందో క్లుప్తంగా తెలియాలంటే చదవండి శరత్ నవల ‘విజయ’.