Book Description
కేప్టో తల్లి బియ్యం దంచి పెట్టి, అటుకులు కొట్టి పెట్టి, పేలాలు వేయించి పెట్టి, ఆ పనీ ఈ పనీ చేసిపెట్టి, అనేక కష్టాలు అనుభవించి కేప్టోధన్‍ను పదునాలుగేళ్ళ వాణ్ణి చేసి అమాంతంగా కన్ను మూసింది. అప్పుడు అతడికి గ్రామంలో నిలబడి ఉండటానికి చోటు లేకపోయింది. సవతి తల్లి కూతురు పెద్దక్క కాదంబిని పరిస్థితి బాగా ఉంది. ‘‘కేప్టో! నీ అక్క గారింటికి వెళ్ళి ఉండు. ఆమె కలిగినవాడి భార్య. బాగా ఉండగలవు’’ అన్నారు అందరూ. తల్లి పోయిన దుఃఖంతో ఏడ్చి ఏడ్చి కేప్టో జ్వరం కొని తెచ్చుకున్నాడు. చివరికి నయం అయిన తరువాత బిచ్చమెత్తి తల్లి శ్రాద్ధం పూర్తిచేసి, బోడి నెత్తితో ఓ చిన్న మూట ఆధారంగా తీసుకుని అక్కగారి ఊరు రాజహాట్ చేరుకున్నాడు. అక్క అతణ్ణి గుర్తుపట్టలేదు. తరువాత తెలుసుకుని, వచ్చిన కారణం విని అమాంతంగా మండిపడింది. ఆమె తన నియమానుసారంగా పిల్లలను పెట్టుకుని సంసారం జరుపుకుంటూ ఉంది. అకస్మాత్తుగా ఈ ఉపద్రవం వచ్చి పడింది. దారి చూపిస్తూ కేప్టోను వెంటబొట్టుకొచ్చిన ఆ పేటలోని వృద్ధుణ్ణి కాదంబిని కటువుగా నాలుగు చీవాట్లు పెట్టింది ‘‘భలేవాడివేలే అన్నయ్యా! నా పిన్ని కొడుకును పిలుచుకొచ్చావా ఉన్న సంపాదన ఊడ్చిపెట్టడానికి.’’ తరువాత తన సవతి తల్లిని ఉద్దేశిస్తూ ‘‘ఆ ముదనష్టపు ఆడది తాను బ్రతికుండగా ఒక్కనాడైనా మా మంచీ చెడ్డా కనుక్కున్నదా? ఉన్నారా, ఊడేరా అని విచారించిందా? మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు చచ్చిన తరువాత మర్యాద చేయటానికి కొడుకును పంపించిందా? వెళ్ళు, తీసికెళ్ళు అన్నయ్యా! ఈ పరాయిబిడ్డను తీసుకెళ్ళు. ఈ గొడవలన్నీ నేనెక్కడ సంభాళించుకోగలను?’’ అని ఈసడించింది. ఆ పసివాడు కేప్టో ఏమయ్యాడు? అతని అక్క అతనిని ఆదరించిందా, లేదా? తప్పక చదవండి ‘మఝిలీదీదీ’.