Book Description
తెల్లవారింది, ఉదయంపూట జమీందారిగారి ఇంటిలోనుంచి మనుషులు బయటికొచ్చారు. ఎదురుగా ఆశ్చర్యకరమైన దృశ్యం! చెట్టుకింద ఒక మనిషి చచ్చిపోతూ వున్నాడు. చూడటానికి కులీనుడులాగా కన్పిస్తున్నాడు. శరీరంమీద శాలువా, పాదాలకు మెరుస్తున్న చెప్పులు, చేతిలో వుంగరం అలాగే పడివుంది. ఎడమచేతిమీద ఇంగ్లీషులో పేరులోని మొదటి అక్షరం పచ్చపొడిచి వుంది. ‘‘ఆ వ్యక్తి దేవదాసు’’ యీ కథ చదివినవాళ్లు ఎంతగానో క్షోభిస్తారు. అయినప్పటికీ దేవదాసువంటి దురదృష్టవంతుడు, సంయమనం లేనివాడు, పాపిష్టుడూ అయిన వ్యక్తితో ఎవరికైనా పరిచయం వుంటే వాళ్లు అతనికోసం పరమేశ్వరుని ప్రార్థించండి. ఇంకేమైనా కానివ్వండి. కాని దేవదాసు మృత్యువు లాంటిది ఎవరికీ సంభవించకూడదని ప్రార్థించండి. మృత్యువు సంభవించడంలో హాని ఏమీలేదు. కాని ఆ సమయంలో స్నేహహస్తపు స్పర్శ తలమీద తప్పకుండా వుండాలి. కరుణార్థ్రమై వున్న ఒక వదనాన్ని చూస్తూ చూస్తూ యీ జీవితం అంతం కావాలి. అందువల్ల మరణించే సమయంలో ఎవరి నయనాలనుండి అయినా రాలిన రెండు అశ్రుబిందువులు చూసి అతడు శాంతితో మరణించగలగాలి. శరత్ అద్భుత సృష్టి ‘దేవదాసు’ నవల సినిమాగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఘన విజయం సాధించిన సంగతి పాఠకులందరికీ తెలిసిన విషయమే. ఇక చదవండి.