Book Description
చంద్రనాథుని తండ్రి శ్రాద్ధానికి ఖచ్చితంగా ఒక రోజు ముందుగా అతడికీ, అతడి పినతండ్రికీ అభిప్రాయ భేదం ఏర్పడింది. అతడి బాబాయి పేరు మణి శంకర్ ముఖర్జీ. అభిప్రాయ భేదం కారణంగా శ్రాద్ధానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ బాబాయి బాగానే పర్కవేక్షించాడు. కానీ స్వయంగా అతడూ భోజనం చేయలేదు. తన కుటుంబంలోని ఏ వ్యక్తినీ చేయనివ్వలేదు. బ్రాహ్మణుల భోజనాలు అయిపోగానే చంద్రనాథుడు బాబాయి దగ్గరకు వచ్చాడు. చేతులు జోడించి ‘‘బాబాయి గారూ! మీరు పెద్దవారు, తండ్రితో సమానమైనవారు. ఏదయినా అపరాధం జరిగి వుంటే ఈ సారి క్షమించండి’’ అన్నాడు. పితృతుల్యుడైన మణిశంకర్ ప్రత్యుత్తరంగా ‘‘నాయనా! నీవు కలకత్తాలోఇ ఉండి వచ్చావు. బి.ఏ.లు, ఎం.ఏ.లు పాసయ్యావు. విద్వాంసుడవు, తెలివి గలవాడివి. మేమంటావూ... మూర్ఖులము. అక్షరం ముక్క రాని అజ్ఞానులం. నీకూ, మాకూ పోలికేమిటి?’’ అన్నాడు. ఈ సామాన్యమైన విషయంలో పండితులూ, పామరులూ అనే చర్చ ఎందుకూ? బాబాయి సంకల్పాన్ని చంద్రనాథుడు బాగానే అర్థం చేసుకున్నాడు. బాబాయితో సంబంధం పెట్టుకోనని అతడు లోలోపల శపథ పూర్వకంగా నిశ్చయించుకున్నాడు.