Book Description
కృష్ణకాంతరాయ్ హరిద్రా గ్రామంలోకెల్లా ధనికుడు. జమీందారీ నుంచి ఆయనకు దాదాపు రెండు లక్షలు ఆదాయం వస్తుంది. ఆ ఆస్తంతా ఆయన, ఆయన తమ్ముడు రమాకాంతరాయ్ కలిసి సంపాదించారు. ఇద్దరూ చాలా అన్యోన్యంగా వుండేవారు. రెండోవాడు మోసం చేస్తాడేమోనన్న అనుమానం ఇద్దరిలో ఎవరికీ ఎంతమాత్రం వుండేదికాదు. ఆస్తంతా పెద్దవాడైన కృష్ణకాంతుడి పేరనే వుంది. అన్నదమ్ములిద్దరూ ఉమ్మడిగానే వుండేవారు. కొన్నాళ్ళకి రమాకాంతుడికి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు గోవిందలాల్. ‘ఆస్తిపాస్తులన్నీ ఒకడిపేరనే వున్నాయి. రాతకోతలన్నీ పూర్తిచేసుకుంటే పిల్లవాడి భవిష్యత్తుకు మంచిది’ అనుకున్నాడు రమాకాంతుడు కొడుకు పుట్టాక. అన్న తనని ఎప్పటికీ మోసం చెయ్యడని అతనికి గట్టి నమ్మకమే వుంది. కాని, ఆయన కాస్తా ‘హరీ’ అంటే, అన్న కొడుకులు తనకు న్యాయం కలిగిస్తారనే నమ్మకం మాత్రం లేదు. ఇదంతా ఆలోచించుకుని కూడా ఆస్తి పంచిపెట్టమని అన్నని అడగడానికి సంకోచించేవాడు రమాకాంతుడు. ‘ఇవ్వాళ చెబుదాం! రేపు చెబుదాం’ అనుకుంటూనే ఒకసారి జమీందారీ పనిమీదనే ఎక్కడికో వెళ్లి హఠాత్తుగా మరణించాడు. తమ్ముడి కొడుకుని మోసగించి సంపద సర్వస్వమూ హరించాలనే కోరిక గనుక కృష్ణకాంతుడి కున్నట్లయితే ఇప్పుడతనికి అడ్డేమీ లేదు కాని, కృష్ణకాంతుడి మనస్సులో అలాంటి దుర్బుద్దికి ఎంతమాత్రం చోటులేదు. తన కొడుకులతోపాటు గోవిందలాల్‍ని కూడా పెంచాడు. న్యాయంగా అతనికి చెందవలసిన ప్రకారం ఆస్తిలో సగభాగం గోవిందలాల్‍కి వ్రాసి యివ్వడానికి నిశ్చయించుకున్నాడు. ఇక చదవండి.