Book Description
విప్రదాసు స్నేహపూర్వకదృష్టిని ఆమెపట్ల పరపి ఇలా అన్నాడు. ‘‘కుముదినీ! ఇప్పుడు పడమటి దిక్కుగా వున్న మేఘాలు మరికొంతసేపటికి తూరుదిశకు వస్తాయి. సంసారంలో ఇటువంటి గాలి ఎప్పుడూ వీస్తూనే వుంటుంది. మేఘాల మాదిరే మనుష్యులు కూడా అటు యిటు సంచరిస్తూ వుంటారు. నీవు యెక్కడికి వెళితే అక్కడల్లా నీకు లక్ష్మీపీఠం యేర్పడుతుంది. ఇదే నా ఆశీర్వాదం తల్లీ!’’ విప్రదాసు పాదాలదగ్గర తలచేర్చి కుముదిని చాలాసేపు కూర్చుండిపోయింది. తుఫాను యెప్పుడయితే నావను తీరంనుండి లాక్కుపోవడానికి ప్రయత్నిస్తుందో అప్పుడే లంగరు మట్టిని ఆశ్రయించుకుని వుండి పడవ తీరాన్ని దాటి వెళ్ళకుండా అట్టే వుంచుతుంది. అలాగే కుముదిని హృదయం అన్నగారి పాదాల దగ్గరే నియుక్తం అయివుండాలని వాంఛిస్తోంది. కుముదిని తన భర్త అయిన మధుసూదన్ తన అన్నతో, తన పుట్టింటి బంధువర్గంతో ప్రవర్తించిన తీరు చూసింది. ఇప్పుడు అతను తన ఆంగ్ల మిత్రబృందంతో ప్రవర్తిస్తున్న తీరు చూస్తోంది. ఇప్పుడు అతను చాలా మంచివాడుగా అగుపిస్తున్నాడు. ఆయన ముఖంలో నవ్వు అనవరతం కనిపిస్తూనే వుంది. అయితే ఆయన ప్రకృతి చంద్రునివంటిది అనిపించింది ఆమెకు. ఒక ప్రక్క ప్రకాశవంతము, మరొకపక్క అంథకారబంధురము అయిన యీ వైచిత్య్రం ఆమెకు అక్కజం అనిపించింది. మధుసూదన్ యొక్క స్వభావాన్ని గురించి ఆమె యిప్పుడిప్పుడే ఆలోచిస్తోంది. అన్నగారి ప్రేమకు, భర్త అహంకార, నిరాదరణలకు మధ్య నలిగిపోయిన కుముదిని చివరికి ఏం చేసింది? చదవండి!