Book Description
నీ నుంచి నేనేమీ కోరలేదు. నా పేరు కూడా నీ చెవిని వేయలేదు. వెళ్లివస్తావని నీవు సెలవు తీసుకొని వెళ్ళేటప్పుడు నేను మౌనంగా ఒక్కమాటైనా మాట్లాడకుండా నిల్చున్నాను, వాలుగా పడిన చెట్టునీడలో బావిగట్టుగా ఒంటిగా నిల్చున్నాను. మట్టి కుండలలో నీరు నింపుకుని ఆడంగులు యిళ్ళకు వెళ్లిపోయారు. ‘‘ప్రొద్దెక్కింది. నువ్వు రావూ?’’ అని నన్ను పిలిచారు. కాని నేను యేదేదో కలలు కంటూ యిక్కడే నిల్చిపోయాను. నీవు వచ్చేటప్పుడు నీ అడుగుల చప్పుడు నాకు వినిపించలేదు. దీనంగా వున్న కళ్ళతో నా వైపు చూచావు. అలసిన కంఠస్వరంతో నీవు మెల్లగా నాతో మాట్లాడావు. ‘‘నేనొక పాంథుణ్ని. నాకు దాహం వేస్తూంది’’ అన్నావు. పగటి కలలలో మునిగివున్న నేను నీ మాటలు విని ఉలిక్కిపడి లేచి నా కుండలో నుంచి నీ దోసిట్లో నీరుపోశాను. పైన చెట్ల ఆకులు గలగలలాడాయి. చెట్ల కొమ్మలలో దాగిన కోకిల కూజితం చేసింది. ‘‘బాబ్లా’’ పూల పరిమళం త్రోవ కొననుంచి తేలుతూ వచ్చింది. నా పేరేమిటో చెప్పమని నీవు అడిగినప్పుడు నేను సిగ్గుతో తలవంచుకొని నిల్చున్నాను. అవును, నీవు నన్ను ఎల్లప్పుడూ గుర్తుంచుకోటానికి నీకు నేను చేసిందేమిటి? కాని నీ దాహం తీర్చటానికి నీరిచ్చారన్న జ్ఞాపకం యెప్పుడూ నా హృదయంలో పచ్చగా వుంటుంది. నా హృదయాన్ని ఎల్లప్పుడూ మాధుర్యంతో నింపివేస్తుంది. చాలా ప్రొద్దెక్కింది. వేపచెట్టు ఆకులు గాలికి గలగలలాడుతున్నాయి. అలాగే బావిగట్టున కూచుని కలలు కంటున్నాను.