Book Description
సాధారణంగా క్రైమ్ వేరు, డిటెక్టివ్ కథలు వేరు అని కొందరు భావిస్తారు. కాని క్రైమ్ కథ అనే విశాల సాగరంలో డిటెక్టివ్ కథ ఒక అలలాంటిది మాత్రమే. నేరం జరగందే నేర పరిశోధన జరగదు. కాబట్టి ప్రతి క్రైమ్ కథ డిటెక్టివ్ కథ కాకపోవచ్చు గానీ, ప్రతి డిటెక్టివ్ కథ క్రైమ్ కథ అవుతుంది. అందుకని క్రైమ్ శీర్షికన డిటెక్టివ్ కథలు ఆరంభించాను. డిటెక్టివ్ కథలు రాయటం వల్ల పాఠకుడి దృష్టిని నేరం నుంచి పరిశోధన వైపు మళ్లించవచ్చు. అలా డిటెక్టివ్ శరత్ కథలు నవ్య వార పత్రికలో ఆగస్ట్ 8, 2012 సంచిక నుంచి ఆరంభమయ్యాయి. కొందరు క్రైమ్ కథలను రాయటాన్ని నిరసించి, వ్యక్తిగతంగా విమర్శించారు. కానీ, పాఠకుల ఆదరణ చూస్తూంటే ఆ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదనిపించింది. అయితే ఒక విషయం మాత్రం నేను గర్వంగా చెప్తాను. నా క్రైమ్ కథలు పాఠకులకు అనేక విషయాలు తెలిపాయి. ఎన్నిరకాలుగా మోసాలు జరుగుతున్నాయో హెచ్చరించాయి. సెల్‍ఫోను, ఫేస్ బుక్‍లు, వీడియోల చిత్రీకరణ, నెట్, మార్ఫింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానం ఏ రకాలుగా మనుషుల్లోని వికృత ప్రవృత్తులకు ప్రేరణనిస్తున్నాయో తెలిపి, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపాయి. ఈరకంగా సెన్సేషనలిజం కోసమో, రెచ్చగొట్టటం కోసమో కాక పాఠకులకు పలు విషయాలను తెలిపే సామాజిక బాధ్యతను రచయితగా నిర్వహించానన్న తృప్తిని ఈ కథలు నాకు కలిగిస్తున్నాయి. సాహిత్యమనే మహాసాగరంలో క్రైమ్ కథ ఒక ప్రత్యేకమైన పాయ లాంటిది. చిన్నచూపు చూడటం వల్ల లాభంలేదు. క్రైమ్ కథలు సామాజిక మనస్తత్వాలను, నిరాశలను, ఆవేశాలను ప్రదర్శించి హెచ్చరిస్తాయి. సామాజిక మనస్సాక్షిని తట్టిలేపుతాయి. అంతేకాదు, ఆసక్తిగా ఉండి పాఠకులలో పఠనాసక్తిని రేకెత్తిస్తాయి. సాహిత్య శిఖరారోహణలో తొలిమెట్లలో ఒక మెట్టు క్రైమ్ కథ. నిజాయితీతో, నిబద్ధతతో రాసిన ఏ కథ కూడా ఎవరికీ చెడు చేయదు. ఇది నా నమ్మకం, అనుభవం. కాబట్టి క్రైమ్ కథలు రాయటం, చదవటం నేరం కాదు. ఇవి మన జీవితాలలోని ఓ లోటును పూడ్చి కాస్త ఉత్సాహాన్ని, కాస్త ఆలోచనను కలిగిస్తాయి. డిటెక్టివ్ శరత్ కథలలో నేను డిటెక్టివ్ కథా రచనలో ఎన్ని పద్ధతులు, పక్రియలు ఉన్నాయో అన్ని రకాలూ వాడాను. వాడుతున్నాను. ఈ డిటెక్టివ్ శరత్ పరిశోధన కథలను మీరు ఆదరిస్తారన్న విశ్వాసం నాకు ఉంది.