Book Description
ప్రకృతి కూడా రోదిస్తున్నదా అన్నట్లు కురవసాగింది ఆకాశం. ఆ నీళ్ళు - జనం కన్నీళ్ళు అన్నీ కలగా పులగమయ్యాయి. సునీత హృదయంలా! కుండపోతగా బయట వర్షం కురుస్తూనే వుంది. అయినా జనం కదలలేదు. ఇంద్రజిత్‍పోలీసు ఆఫీసర్‍గా - డిటెక్టివ్‍గా - చనిపోయాడని ఆ క్షణంలో అందరూ అనుకున్నా - మానవత్వం వున్న మనిషిగా అందరి హృదయాల్లో కలకాలం ఉంటాడని అక్కడ చేరిన ప్రజల ఆక్రోశం, హృదయవిదారక దృశ్యాలు - చెప్పకనే చెప్తున్నాయి. సునీత మళ్ళీ పరికించి మృతదేహాన్ని చూసింది. ఒకసారి కాదు - పదిసార్లు - వందసార్లు - వేయిసార్లు - తనను ఎప్పుడూ నవ్విస్తూ తన జీవితాన్ని ఆనందమయం చేసినవాడు - తనను ఎప్పుడూ చిలిపిగా కవ్విస్తూ జీవితాన్ని విలాసాల పంటగా మార్చినవాడు తన బుడిబుడి విజ్ఞానానికే అచ్చెరువొందినట్లు - తన స్థాయిలో ఉన్నంతగా నిలబెట్టి జీవితాన్ని తీర్చిదిద్దినవాడు. తన సగాన్ని పంచుకోటానికి పుట్టినవాడు. ఏడీ -? ఆ మృతదేహమా? ఇన్నాళ్ళు తన జీవితానికి ఓ అర్థాన్నీ ప్రయోజనాన్ని కల్పించింది? ఇంద్రజిత్ చచ్చిపోయాడా? తనను వదలి శాశ్వతంగా వెళ్ళిపోయాడా!? నో....నో...నో. కళ్ళు సత్యాన్ని చూడమంటున్నాయి. మనసు నమ్మవద్దని హెచ్చరిస్తున్నది. ప్రక్కనే ఫోన్ - గణగణా మోగింది. సునీత గుండెలో ఫోన్ గణగణ ప్రతిధ్వనించింది. నెమ్మదిగా ఫోను అందుకొని నిస్తేజంగా ‘‘హల్లో’’ అంది. ‘‘సునీ..’’ఆ పిలుపుకు క్షణకాలం సునీత గుండె లయ తప్పినట్లయింది. ఆ పిలుపు మురళీరవంలా వినిపించింది. ఉలిక్కిపడి ఎదురుగా ఉన్న శవాన్ని చూసింది. ఆ శవం కాదు తనను పిలిచింది, అంతా తన భ్రమా? సునీ.. ఫోన్‍లో మళ్ళీ అదే పిలుపు.