Book Description
మిథిలానగరమునకు రాజు జనకుడు. జనకుడు ధర్మాత్ముడు, కీర్తిమంతుడగు కర్మయోగి. రాజర్షి, ఆ రాజు యజ్ఞము చేయుటకై భూమిని దున్నుచుండగ ఆ భూమినుండి అమూల్యమైన రత్నము బయల్పడినట్లు ఒక బాలిక బయల్పడెను. ఆ పసిబిడ్డ అమిత సౌందర్యరాశియై, లక్ష్మీ అంశయై ఒప్పుచుండెను. ఆమె నాగేటి చాలులో దొరుకుటచే జనకుడు ఆ బిడ్డకు సీత అని నామకరణము చేసెను. ఆ రాజు ఆ బిడ్డను అల్లారుముద్దుగ పెంచుచుండెను. ఆమె అతిరూపవతిగా పెరుగుచుండగ ఆమె సద్గుణములు, సౌందర్యము, సౌకుమార్యమును ప్రసిద్ధములయ్యెను. దశరథుడు మిథిలకు వచ్చిన పిదప దేవదుందుభులు మ్రోచుండగ సీతరామకళ్యాణము జరుగగ దశరథుడు తన కోరిక నెరవేరి పుత్రులతో అయోధ్యకు తిరిగి వచ్చి ఆనందముగనుండెను. సీతాదేవి రామునియెడల ‘మనసుతో, ఆత్మతో విడదీయరాని బంధమును అనుభవించుచుండెను. ఆమె హృదయము నిత్యము రామునికి వానస్థానమయ్యెను. ప్రశస్తమైన మనసుగల రామునకు సీతాదేవి అత్యంత ప్రీతిపాత్రురాలై యుండెను. శరీరసౌందర్యమేకాక ఆమె సద్గుణరాశి కూడ అగుటచే రామునకు ఆమె యందు నిరతిశయ ప్రీతి కల్గెను. కైకేయి కోరిక ప్రకారం సీతారామలక్ష్మణులు అయోధ్యను వీడి గంగానదిని దాటి అరణ్యమున ప్రవేశించిరి. కొంతకాలానికి అక్కడ బంగారు లేడిని చూచి రావణునిచే అపహరింపబడి లంకకు కొనిపోబడెను. శ్రీరాముడు రావణుని సంహరించి సీతను విడిపించి ఆమెను అగ్నిపరీక్షకు గురిచేయగా అగ్నిహోత్రుడు సీతాదేవిని అక్కున చేర్చుకుని ‘‘మనసా, వాచా, కర్మణా వైదేహి పరిశుద్ధ. ఈమెను స్వీకరింపు’’మని రామునితో చెప్పెను.