Book Description
ప్రతిచర్యకూ ఒక సంకల్పం వుంటుంది. ఆ సంకల్పానికొక దృఢమైన గమ్యం వుంటుంది. ఆ గమ్యంపైనే సదా యేకచిత్తం, దృష్టీ వుంటాయి. ఆ గురిని చేరుకోవటానికి మార్గాలెన్నో కనబడతాయి. వా•న్నింటినీ తిరుగుతూ పోవడం వ్యర్ధం అనుకోరాదు. ఎంతకాలమైనా, ఎన్ని ప్రయాసలైనా లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం మానవుని పరమార్ధం. ఒక్క దివ్యమూలికను తీసుకుని రావలసిన హనుమ, ఆలస్యం భరించలేక తికమకపడి, వేరేమార్గం గానక పర్వతాన్నే ఎత్తుకుపోయి లక్ష్మణున్ని కాపాడుకోగలిగాడు. అజీర్ణం తాళలేక ఒక్క దివ్యమూలాన్ని దహించగోరి మొత్తం ఖాండవ దహనం చేశాడు జాతవేద్యుడు. కృష్ణార్జునులకు దివ్యాస్త్రాలు, రధాలు, సుదర్శనాదులను అందించగల్గిన అగ్నికి ఖాండవదహనం సాధ్యం కాలేదా?!! అసలు అజీర్ణం చేయడం సంభవమా?! అనుకుంటే అదంతా విధిలీలగా సమాధానం చెప్పుకుని సంశయానికి తావులేకుండా చేసుకోవాలి. కాబట్టి పట్టువీడని విక్రమార్కుడైన నిజపాఠకుడు, ప్రళయ ప్రమాదాల్ని యే రీతిగా తప్పించుకోగల్గుతాడో, తప్పించుకోవాలో యీ గ్రంధంలోని కథనాల్లో ఒక్కో అక్షరంగా నిక్షిప్తం చేయడం జరిగింది. అంతేగాక! విక్రమనామ సంవత్సరం నుంచీ ముందు ముందు యేయే ప్రకృతి ప్రకోపాలు వికోపాలు జరుగనున్నాయో సంక్షిప్తంగా వివరించుటకు భవిష్య వాణిని వివరించడం జరిగింది. ఇది కల్పన కాదు. ముందు ముందు ఖచ్చితంగా జరగబోతున్న యదార్ధ సంఘటనల సమాహారం. అంతేగానీ యే వొక్కరినో భయపెట్టడానికో గుండెదడలు పుట్టించడానికో యీ కల్పనలు జేయడం జరగలేదు. అదీగాక మరో గ్రంధంలోంచి యేర్చి కూర్చినవీ కావు. స్వామీజీలు బోధించినవీ కావు. నరుడే నారాయణుడన్న దైవజ్ఞుల మాట పొల్లుబోదు. ప్రయత్నం వల్ల అసాధ్యమైనదేదీలేదు, అది అసంభవమూ కాదు. కానీ! ప్రతి వ్యక్తీ అందుకు తగిన శ్రమను, ఏకాగ్రతనూ పెంచుకుని కార్య దక్షతను సాధించాలి. అదే మనలో లోపించింది. ఆ లోపాన్ని సరిజేసుకోగల్గి సాగడం, జయం కైవశం చేసుకోవడం ముఖ్యమైన కర్తవ్యం. అది ఒక యజ్ఞం. ప్రతి ఒక్కరూ ఆలోచించి, నిజానిజాలను తెలుసుకుని తమకు తామే సత్యమన్నదేదో తెలుసుకోగలగాలి. అదే ప్రయత్నం మనకు కావాలి. ప్రియపాఠకులు ఈ గ్రంధాన్ని సహృదయంతో పఠించి ఆదరించగలరని ఆకాంక్షిస్తూ...