Book Description
మన ఆంధ్రదేశంలో బొబ్బిలియుద్ధం గురించీ, తాండ్రపాపారాయుడి వీరత్వాన్ని గురించీ, ప్రభుభక్తి పరాయణతను గురించీ, జానపదులు కథలుగా పాటలుగా పాడుకొంటారు! అదేవిధంగా అల్లూరి సీతారామరాజు దేశభక్తి గురించీ, వీరత్వాన్ని గురించీ కథలు కథలుగా ప్రజలు చెప్పుకొంటూ ఉంటారు. అవి ఎంతగా ప్రాచుర్యం పొందాయంటే - ఆ కథాంశాలుగా వచ్చిన చలనచిత్రాలు అమితమైన ప్రేక్షకాదరణ పొందాయి. మనకి మల్లేనే - ఆంగ్లేయులు అమితంగా అభిమానించే హీరో రాబిన్‍హుడ్. ఇంగ్లండ్‍లో అతడి వీరగాధల్ని వీధి గాయకులు పాటలుగా పాడుకొంటుంటారు. అతడి జీవితాన్ని కథాంశంగా తీసుకొని తీసిన చలనచిత్రాలు బంపర్ హిట్లయ్యాయి. ఆ కాలపు పరిపాలకుల అన్యాయాల్నీ అక్రమాల్నీ నిర్భయంగా సాహసోపేతంగా ఎదిరించిన మన్యం వీరుడతను. అతనెప్పుడు జీవించిందీ ఎక్కడ జీవించిందీ నిర్ధిష్టంగా తెలియకపోయినా అతని కథ మధ్యయుగాల్లో నాటింగ్‍హేమ్ పట్టణంలోనూ దానికి చేరువలో ఉన్న షేర్‍ఉడ్ అరణ్యంలోనూ జరిగినట్టుగా అందరూ నమ్ముతారు. గ్రీన్‍ఉడ్ అరణ్యంలో ఉన్న అతని సమాధిని యాత్రికులు నిత్యం దర్శిస్తూ ఉంటారు.