Book Description
శ్రీపురం విజయాంధ్ర సామ్రాజ్యానికి రాజధాని. అది సిరిసంపదలకు, అంద చందాలకు, విద్యాలయాలకు, దేవలయాలకు, వర్తక ప్రముఖులకు, వితరణశీలురకు మిగతా తెలుగు రాజ్యాల రా•ధానులకంటే ఎన్నో రెట్లు గొప్పదని పేరొందింది. పవిత్ర కృష్ణానదీ తీరాన క్రోసెడు పొడవు, అంతే వెడల్పు వ్యాపించిన ఆ మహానగరానికి, తూర్పున ఒడ్డు లొరుసుకుంటూ, ఉరవళ్ళు పరవళ్ళు తొక్కుతూ ప్రవహించే కృష్ణవేణి, మిగతా మూడుదిక్కులా ఆకాశాన్ని అందుకోడానికి ఎగబెరిగి నట్టుండే కొండలు పెట్టనికోటలు, నియమించని కాపలా దారులుగా వుండేవి. అయితే, సహజ సిద్ధమైన కాపలాలున్నాయి గదా అని శ్రీపుర చక్రవర్తులు తమ రాజధాని సంరక్షణకు తగు యితర ఏర్పాట్లు చేయకుండా వుండలేదు. రథ; గజ, తురగ పదాతి సైన్యాలను సర్వపటిష్ఠంగా, ప్రతిక్షణం సంసిద్ధంగా వుంచే వీర సేనాపతులపై ఆ బాధ్యతలుంచి, వారినీ, రక్షణ సిబ్బందినీ ఏ కొరతా లేకుండా పోషిస్తున్నారు. అంతేకాక, వారి సామ్రాజ్యాధికారంలో యిమిడియున్న ఇతర తెలుగు రాజులచేత గూడ చతురంగ బలాలను సౌష్ఠవంగా పెంపొందింపజేస్తూ, తెలుగు ప్రజలు పరరాజుల దండయాత్రల భయం లేకుండా, తమ యిచ్చవచ్చిన వృత్తులు రేయింబవళ్ళు కొనసాగించుకునేందుకు తోడ్పడ్డారు. అందువల్ల, ఆ కాలంలో విజయాంధ్ర సామ్రాజ్యం సు•శాంతులతో, పాడి పంటలతో, విద్యసంస్కారాలతో, దానధర్మ నియతితో నిండుకుండలా ముచ్చట గొలిపేది. ఆచార్య నాగార్జునులు నిర్వహిస్తున్న విశ్వవిద్యాలయంలో ఉన్నత విజ్ఞాన విద్యలు నేర్పిన పండితులు, కళాకారులు, వైద్యులు, నిపుణులు, రాజధర్మ నీతికోవిదులు తెలుగునేల నాలుగు చెరగులా ప్రజలకు చేదోడు వాదోడుగా వుంటున్నారు. అన్నివిధాలా ఆదర్శప్రాయంగా వుంటున్న ఆ ఆంధ్ర సామ్రాజ్యన్ని వేంకట భూపతి పాలిస్తున్న కాలంలో ఒక విపరీతం జరిగి ఆ కృష్ణా మండలాన్ని అంతటినీ కుతకుత లాడించింది. చల్లటి మంచినీటి చెరువులో మొసలి ప్రవేశించి వెర్రెత్తి సంచరించి నట్లయింది. ఇక ఈ విజయాంధ్ర సామ్రాజ్య వైభవానికి వినాశం తప్పదేమోనని ఆబాల గోపాలం తల్లడిల్లిపోవలసి వచ్చింది. ఏమిటా విపరీతం? తప్పక చదవండి.