Book Description
దశమహావిద్యలలో ప్రయోగ విద్యలు, మోక్ష విద్యలు, ఐహిక సాధన విద్యలు సంలీనమయినాయి. మాతంగి, బగళ, ధూమావతి మొదలైన విద్యలు తీవ్ర సాధనకు సంబంధించినవి. తార, భైరవి, త్రిపురసుందరి ఈ మూడు సాత్విక సాధనకు సంబంధించినవి. భువనేశ్వరి జీజాక్షరం మహాలక్ష్మి అష్టోత్తర నామాలలో సంలీనమయినది. కాలక్రమంలో దశమహావిద్యలను విష్ణువు దశావతారాలను సంయోజన పరచే పద్ధతి వచ్చింది. సౌందర్య బహుళమైన రసారామ విహార శీలమైన వైష్ణవ మార్గానికి తీవ్ర సాధనలతో కూడిన దశమహావిద్యల మార్గానికి చేయబడ్డ ఈ సమన్వయం భారతీయ సంస్క•తిలోనే కేంద్రబిందువు నుండి విస్తరిస్తూ పోయే వలయాల పద్ధతిని, సమన్వయాన్ని సూచిస్తుంది. శ్రీ గణపతిముని ఉమా సహస్రంలో అమ్మవారి స్మిత సౌందర్య వర్ణన చేసిన సందర్భంలో ఈ దశమహా విద్యల విశిష్టాంశాలు చాలా సుందరంగా చెప్పినారు. శ్రీ గణపతిముని స్వయంగా ఈ సాధనలన్నీ చేసి చివరకు సిద్ధులన్నింటికీ అతీతంగా ఆత్మ విద్యను పొందటానికి తనకంటే వయస్సులో చిన్నవాడైన భగవాన్ రమణమహర్షి చెంతకు చేరారు. ఇంతటి మహాశక్తి విభవాన్ని బహు గ్రంథాలు పరిశీలించి తన పరిమితిలో చిరంజీవి సంతోష్‍కుమార్ ఈ గ్రంథంలో వెల్లడించాడు. ఈ శక్తుల సాధన అంత సులభం కాకపోయినా వాటిని గూర్చిన మననం కూడా కొంతలో కొంత ఫలితాన్నిస్తుంది.