Book Description
జానపద కథలు మన దేశ సంపద. మన ఆలోచనలు, ఆశయాలు, అనుబంధాలు ప్రాథమిక రూపంలో వున్నపుడు పుట్టిన కథలవి. వాటిల్లో కలలుంటాయి. కల్పనలుంటాయి. అభూత కల్పనలుంటాయి. జానపదుల అమాయకత్వం అడుగడుగునా కనిపిస్తుంది. మనిషి ఎప్పుడూ కోల్పోకూడని నిధి అమాయకత్వం. ఆధునిక ప్రపంచం ఆ అమాయకత్వాన్ని కోల్పోయింది. అమాయకత్వం వేరు, మూర్ఖత్వం వేరు. అమాయకత్వంలో స్వచ్ఛత వుంటుంది. జానపద కథల్లో స్వచ్ఛత వుంటుంది. తరాలు మారినా వేల సంవత్సరాలు గడిచినా జానపద గాథలు వేనోళ్ళగుండా యిప్పటికీ మనకు అందుబాటులో వున్నాయి. వాటిల్లో కాలుష్యం ప్రవేశించడం కష్టం. అందువల్ల నిష్కపటమైన పసిపిల్లలు జానపద కథలంటే ఎంతో యిష్టపడతారు. ఆటలు కూడా మాని ఆసక్తిగా వింటారు. మన భారతదేశం అనంతమయిన జానపద కథల కాసారం... భాండాగారం. ఆసక్తికరమయిన, ఆహ్లాదకరమయిన, అద్భుతమయిన జానపద కథలివి. పిల్లలే కాదు... పసితనాన్ని నిలుపుకున్న పెద్దలు కూడా చదివి ఆనందించదగిన కథలివి. మన దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన జానపద కథలిందులో వున్నాయి.