Book Description
నారాయణునికి నారాయణికి అభేదం. ఆ సిద్ధాంతం చాలా విచిత్రంగా ఉంటుంది. శివుని భార్య శివాని. రుద్రుని భార్య రుద్రాణి. భైరవుని భార్య భైరవి. నారాయణి పేరు చెప్పినప్పుడు నారాయణుని భార్య అనకూడదు. నారాయణుని చెల్లెలు నారాయణి. వాళ్ళు ఇద్దరు ఒక్కలా ఉంటారు. ఇద్దరూ అలంకారప్రియులు, ఏవిధంగా నారాయణుడు పరమశివుని శరీరంలో సగభాగాన్ని పొందాడో అదేవిధంగా నారాయణి అయిన అమ్మవారు పరమశివుని శరీరంలో సగభాగాన్ని పొందడానికి శ్రీమన్నారాయణుని వద్ద ఉపదేశం పొందినది. మనకు అనుమానం రావచ్చు, శ్రీమన్నారాయణుడు అప్పటికే సగం శరీరాన్ని పొందితే మిగిలిన శరీరం అమ్మవారు పొందితే మరి శివునికి అస్తిత్వం ఏది? ఒక సగం నారాయణుడు. ఒక సగం అమ్మవారు. శివుడు అలా ఎలా ఇస్తాడు? అంటే అది ఒక పదార్థంవలె శరీరాన్ని కత్తిపెట్టి కోసెయ్యడం కాదు. దాని వెనక ఒక ఆధ్యాత్మికమైన రహస్యం ఉంటుంది. ఎంతమంది ఎక్కినా పుష్పక విమానంలో ఒకరికి చోటు ఉంటుంది అంటారు. అలా ఎంతమంది పరమాత్మలోకి చేరుతున్నా పరమాత్మలో అవకాశం ఉంటుంది. మూర్తి స్వరూపం మారుతుంటుంది. అమ్మవారు పక్కన చేరితే 14 వది అయిన అర్ధనారీశ్వరస్వామి. 13వ స్వరూపం హరిహరమూర్తి. పరమశివునికి 63 లీలా మూర్తులు ఉన్నాయి.