Book Description
ద్వైతం అంటే రెండు. రెండు కానిది అద్వైతం. అంటే ఒకటి. మనకు ఉన్న జ్ఞానం ఒకటే. దీన్ని ప్రచారంలోకి తీసుకువచ్చిన మహానుభావుడు శంకరుడు. ఆయన కారణజన్ముడు. మన పుట్టుకకూ, మహానుభావుల పుట్టుకకు మధ్య వ్యత్యాసం ఉంటుంది. మనం గత జన్మలలో చేసిన పాపపుణ్యాల ఫలితాలను అనుభవించటం కోసం, ప్రాకృతమైన శరీరంలో ప్రవేశించి, ఆ కర్మ ఫలితాన్ని సుఖంగా, దుఃఖంగా అనుభవిస్తుంటాం. కానీ శంకరుడు సాక్షాత్తు సదాశివుడే. ‘‘పరిత్రాణాయ సాధూనాం, వినాశాయచ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ, సంభవామి యుగే యుగే...’’ అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెబుతాడు. ధర్మానికి ఇబ్బంది కలిగినప్పుడు, ధర్మ సంస్థాపన కోసం ఈశ్వరుడు రకరకాల అవతారాలలో ప్రత్యక్షమవుతాడు. కొన్ని సార్లు భక్తి జ్ఞాన వైరాగ్యాల ప్రబోధాలు చెయ్యడం కోసం కూడా అవతరిస్తాడు. అలా శంకరభగవానులు స్వీకరించిన ఉత్కృష్టమైన అవతారాలలో ఆదిశంకరుడి అవతారం కూడా ఒకటి.