Book Description
నేను లతీఫ్ ముఖంలోకి సూటిగా చూస్తూ, ‘‘రావు అంటున్నది నిజమేనా? నేను నీ మిత్రుడు భార్యను కాబట్టే నన్ను కోరలేకపోయావా?’’ అన్నాను. ‘‘అవును!’’ ‘‘మరి నీ మిత్రుడి భార్యను నీ మిత్రుడినుండి దూరం చేసే ఐశ్వర్యాన్ని నాకెందుకు ఎరగా చూపావు? ఆ మత్తులో నన్నెందుకు మునిగిపోనిచ్చావు? ఇంత మునిగేవరకూ ఎందుకూరుకున్నావు?’’ ‘‘నువ్వు కోరిన ఐశ్వర్యాన్ని నీకిచ్చింది నా మిత్రుడికోసం నిన్ను కాపాడటానికి!’’ ‘‘అదేమిటి?’’ ‘‘ఒక్కొక్కసారి మనసు గురించి నిజాలు మనకు తెలియవు. వాస్తవానికి అది తెలియకపోవటం కూడా కాదు. మనమే ప్రయత్నపూర్వకంగా తెలిసిపోకుండా జాగ్రత్తపడతాము. తెలిసిపోతే భరించలేం కనక! నువ్వానాడు నా పేర పుస్తకం పంపిన వెంటనే నీలోని ఆ చీకటికోణం నాకర్థమైపోయింది. రావు వద్దంటున్నా నా కారులో వచ్చిన నీ ఐశ్వర్యకాంక్ష అర్థమైంది. నా మేడను యావగాచూసే నీ చూపులతో నా అనుమానం దృఢపడింది. నేను నీ సౌందర్యాన్ని చూపులతో ప్రశంసించలేదని ఉడుక్కోవటంలో నీ అహం అర్థమైంది. నన్ను గురించి నీకు పూర్తిగా తెలుసుకుని నాకు తెలుసు. మరి, నాకా పుస్తకం ఎందుకు పంపావు? ఏ రకమైన గౌరవం నా మీద నీకు? ఆ అవకాశాన్ని నేనందుకోకపోతే నువ్విదే అవకాశాన్ని మరొకరికియ్యవచ్చునని తోచింది. నామీద నీకు ప్రత్యేకమైన గౌరవాభిమానాలు లేవని నాకు రూఢిగా తెలుసు. మరొకరు రావును గురించి ఎందుకాలోచిస్తారు? అందుకే నువ్వందించిన అవకాశాన్ని అందుకున్నాను. నిన్ను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించటంలో నాకు తెలియకుండానే నిన్ను ప్రేమించాను. నీకు విపరీతమైన అహం! నీ సౌందర్యానికి అష్టయిశ్వర్యాలలో తులతూగే ఆ రాత సహజంగానే వుందని నీ నమ్మిక! నీకు లభించిన మధ్యతరగతి జీవితంతో నువ్వు తృప్తిపడలేకపోయావు. రోజురోజుకీ నీలో అసహనం పెచ్చు పెరిగిపోతూంది. ఇలాంటి దశలో నువ్వు అతితేలికగా.’’ లతీఫ్ ఆగిపోయాడు. వాక్యం పూర్తి చెయ్యలేదు. చెయ్యమని నేనడగలేదు. నామీద నాకు కలిగిన జుగుప్సతో వణికిపోతున్నాను. అవును! లతీఫ్ చెప్పింది అక్షరాలా నిజం! లతీఫ్ వ్యభిచారగాధల్ని విని, అతణ్ని చీదరించుకునే నేను ఏ కారణంచేత అతనికి నా పుస్తకాన్ని పంపాను? జాలిగా నన్ను చూస్తున్న లతీఫ్ ముఖంలోకి చూడగానే ఏదో పూజ్య భావంతో మనసు నిండిపోయింది.