Book Description
‘‘ఒక సూర్యుడు’’ ‘‘శ్యామ్, ఫిర్ ఏక్ బార్ తుమ్ మిల్‍తే’’ (శ్యామా! మరొక్కసారి నీవు కనిపిస్తే) అనే గుజరాతీ నవలకు తెలుగు అనువాదం. ప్రసిద్ధ గుజరాతీ రచయిత శ్రీ దినకర్ జోషీగారు రాసిన ఈ నవల సుమారు 1988-89లో హిందీ వారపత్రిక ‘‘ధర్మయుధ్’’లో సీరియల్‍గా ప్రచురితమైంది. నా చిన్నప్పుడు హిందీ ప్రఖ్యాత కవి శ్రీ సూరదాసుగారి కవితల్లోని బాలకృష్ణుని మనోహర రూపం నా మనస్సులో నిలిచిపోయింది. ఈ నవలలో కేంద్రబిందువు శ్రీ కృష్ణుడే కావడం జరిగింది. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం తరువాత కథ అంతగా ప్రచారంలో లేదు. యుద్ధానంతరం గాంధారి మాత శ్రీకృష్ణుని శపించిన వృత్తాంతం అందరికీ తెలుసు. కాని దాని పరిణామ క్రమం, ఆ వివరాలు మనకు మామూలుగా లభ్యంకావు. ఈ నవల వృత్తాంతమే అది కావడం నా ఆసక్తికి మరో కారణమైంది. అంతేకాక ఇందులో మహాభారతంలో యుద్ధానంతరం మిగిలిన పాత్రల పరిపూర్ణ విశ్లేషణ, కృష్ణుడు అపారంగా గౌరవించిన ప్రజాస్వామ్య వ్యవస్థ, సామాజిక విలువలు మనల్ని ఎంతగానో ఆలోచింపజేస్తాయి. నిజంచెప్పాలంటే, మన పురాణాలు ఎన్నిసార్లు చదివినా ప్రతిసారీ ఓ క్రొత్తకోణంలో మనకు స్ఫూర్తినిస్తాయి. వాటిలో పొందుపరచిన సామాజిక విలువలు ఈనాటికీ ఎంతో ఆదర్శప్రాయంగానూ, అనుసరణీయంగానూ వుంటాయి. శ్రీ కృష్ణుని విశిష్ట వ్యక్తిత్వంలోని వివిధ కోణాలను మనం దీనిలో దర్శిస్తాం. ఆయన గొప్ప సామాజిక దార్శనికుడు. శ్రీకృష్ణుని గురించి పాఠకులు ఈ నవలలో చదివి, ఆనందిస్తారని ఆశిస్తాను. - రచయిత్రి